Next Story
Newszop

కశ్మీర్లో మరో వలస కార్మికుడ్ని హత్యచేసిన ఉగ్రవాదులు.. వారంలో రెండో ఘటన

Send Push
జమ్మూ కశ్మీర్‌లో వలస కార్మికులపై ఉగ్రవాదులు లక్షిత దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, అనంత్‌‌నాగ్ జిల్లాలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడ్ని ముష్కరులు కాల్చి చంపాయి. బుధవారం బిజ్‌బెహర ప్రాంతంలోని జబ్లిపొరలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బిహార్‌కు చెందిన రాజు షా అనే వ్యక్తి చనిపోయినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. తీవ్రవాదుల కాల్పుల్లో గాయపడిన రాజు షా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. గత సోమవారం దక్షిణ కశ్మీర్‌లోని హెర్‌పొరలో ఉత్తరాఖండ్‌కు చెందిన వలస కార్మికుడ్ని ఉగ్రవాదులు హత్య చేశారు. ఈ దాడిలో దిల్‌రంజిత్ సింగ్ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. ఫిబ్రవరిలోనూ పంజాబ్‌కు చెందిన ఇద్దర్ని శ్రీనగర్‌లో కాల్చి చంపారు. ఈ ఘటనలో ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా.. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కశ్మీర్‌లో వలస కార్మికులపై ఉగ్రవాదుల లక్షిత దాడి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. ముష్కరుల కుట్రలను పసిగట్టి.. సైన్యం తిప్పికొడుతోంది. అయితే, అనంత్‌నాగ్‌లో లోక్‌సభ ఎన్నికలు మే 7 నాలుగో దశలో జరగనుండగా.. తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మియాన్ అలీ పోటీ చేయనుండగా.. గురువారం నామినేషన్ వేయనున్నారు.వలసకార్మికుడిపై దాడిని పీడీపీ అధినేత్రి ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు తీవ్రంగా ఖండించారు. రాజు షా మృతికి సంతాపం తెలిపిన ఆ పార్టీలు.. ఇటువంటి ఘటనలతో జమ్మూ కశ్మీర్‌లో శాంతిని విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాయి. ఇదిలా ఉండగా, ఘటనకు కొద్ది గంటల ముందే బిజ్‌బెహరలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Loving Newspoint? Download the app now